2, జనవరి 2025, గురువారం

యవ్వనం (గేయం)

 అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం గేయ రచనల పోటీ -5 కొరకు వ్రాసిన గేయం 

అంశం: యవ్వనం 


 వ్వనం యవ్వనం 

మురిపించే మధువనం

ఆమని వీడక నిలచే 

సొగసుల బృందావనం  //యవ్వనం// 


పరుగెత్తే హిమనదం 

వడిసాగే ఘన జలదం (2)

ఆశువుగా అలరించే 

రసరమ్యపు కవి పదం  //యవ్వనం//


మది పుట్టదు గద భయం

తన లక్ష్యము మరి జయం (2)

జవసత్వమ్ముల సాగుచు

కదములు త్రొక్కెడి హయం  //యవ్వనం//


పట్టును అభిమత ధ్వజం 

వదలదులే ఇది నిజం (2)

పట్టగ సంకెళ్ళులేక

వని తిరిగే మదగజం   //యవ్వనం//


నవ సుమముల పరిమళం

నవరసముల రుచి ఫలం (2)

దశదిశలను నినదించే

శంఖారవముల గళం  //యవ్వనం//  

 

చిత్రించని ఒక పటం

పడిలేచే పెను కెరటం (2)

పలు ఆశల ఊడలతో

చిగురులు వేసెడు వటం  //యవ్వనం// 


వదిలేస్తే కలకలం 

బంధిస్తే వ్యాకులం (2)

పగ్గాలను చేతబట్టి

పయనిస్తే గోకులం   //యవ్వనం//  


సరి బాటను సాగితే

చెడు చేతలు వీడితే (2)

సుందర భావిని కోరుచు 

నడివయసును నడిపితే   //యవ్వనం// 



1, జనవరి 2025, బుధవారం

వంగడం


 మొలకెత్తింది
"క్రొత్త 2025" వంగడం
"వెలుగు" వృక్షమై నిలచి
"మాను"కోవాలి చీకటికి "వంగడం"