26, ఆగస్టు 2025, మంగళవారం

వాన బిడ్డ

 అమరావతి సాహితీ మిత్రులు "వారం వారం వచన కవితల పోటీలు" కు గతంలో వ్రాసినది. 

అంశం: వాన  

శీర్షిక: వ(హ)ర్షానుభూతి    


వాన బిడ్డకు ఎన్నిపేర్లో....  

 

పుట్టినప్పుడు ముద్దుగా "చినుకు"   

దోగాడుతూ ఉంటే  "చిరుజల్లు"

తడబడు నడకలైతే  "తుప్పర" 

వడివడిగ నడుస్తూ ఉంటే  "వర్షం"     

గంతులేస్తూ పరుగులెత్తితే "కుంభవృష్టి" 


వాన కురిస్తే ఎన్ని అనుభూతులో...   


చినుకులు మొదలౌతూ ఉంటే   

ఆకాశం అక్షతలను 

తలపై చల్లుతున్నట్లు అనిపిస్తుంది  


చిరుజల్లు చిలకరిస్తూ ఉంటే  

వచ్చే మట్టి వాసన

భూమితల్లి పిలిచినట్లు అనిపిస్తుంది


తుప్పర వస్తూ ఉంటే  

కొంచెమైనా ఒళ్ళూ గొంతూ 

తడుపుకోమని చెప్పినట్లు అనిపిస్తుంది


వర్షం పడుతూ ఉంటే  

పారుతూ ఉండే నీరు 

నేలను కడుగుతున్నట్లు అనిపిస్తుంది 


కుంభవృష్టి కురుస్తూ ఉంటే   

ఇంకచాలు బాబూ వెళ్ళు 

అంటూ పెట్టాలి చీవాట్లు అనిపిస్తుంది.  



కామెంట్‌లు లేవు: