31, మే 2019, శుక్రవారం

కూలి పోతుంది

పనిలేకుంటే కష్టజీవులకు
కూలి పోతుంది
ఆసరా లేకుంటే వారి బ్రతుకు
కూలిపోతుంది.

నైట్ వాచ్"మూన్".

చుక్కల పూదోటకి
రాత్రి కాపలాదారు కొలువు 
చంద్రుడికి నెలకి
ఒకరోజు మాత్రమె సెలవు.

30, మే 2019, గురువారం

"చుక్కకన్నెలు"

"చందమామ" కనబడకుంటే 
గుంపులుగా ఎదురు చూపులు 
కనబడితే మూస్తాయి సిగ్గుతో
"చుక్కకన్నెలు" తలుపులు.

29, మే 2019, బుధవారం

'మండి'పడుతున్నాడు.

ఎండాకాలం కూడా 
ఎండలెక్కువంటారేమిటి 
అని సూరీడు 
'మండి'పడుతున్నాడు.

'శంక' రా.

భక్తుల గుండెల్లో 
నిలచి ఉండే శంకరా!
భక్తి లేనివారి 
గుండెల్లో నీవొక 'శంక' రా.

22, మే 2019, బుధవారం

కాలుష్యపు తెట్టు

స్వచ్చమైన నదులపై
తేలియాడుతోంది
కాలుష్యపు తెట్టు
మనిషి మనసులా.

21, మే 2019, మంగళవారం

వెహి'కిల్'

జాగ్రత్త
నడిపేటప్పుడు
వెహి'కిల్'
పేరులోనే
దాగుంది "కిల్".


20, మే 2019, సోమవారం

"హాయి"ల్ బండి

ఆయిల్ తో 
నడిచే బండి 
నడిసినంతసేపు

 "హాయి"ల్ బండి 
ఆగిందా...

హా! "ఇల్" బండి.

18, మే 2019, శనివారం

కుక్కకు

మూర్ఖుడి మనసులో
హితవచనాలు కుక్కకు
ఏమిచేసినా తోక వంకర
సరియౌతుందా కుక్కకు?

16, మే 2019, గురువారం

మేఘాల గుండె పగిలి

పైనుంచి మంచు గడ్డలేమిటి? 
భూమి తాపాన్ని చూసి 
చల్లని మేఘుడి గుండె 
పగిలి ముక్కలైనట్లుంది.

15, మే 2019, బుధవారం

విండో-నెట్-మౌస్

కిటికీ, వల, ఎలుక 
భాష మాత్రమె తెలిస్తే
కిటుకీవల ఎరుక 
విజ్ఞానం సముపార్జిస్తే.

"పంట"నొక్కెయ్యాలని

కాపుగాసిన "కొమ్మా!" జాగ్రత్త
"కాపు" లేకుంటే చూసి
కాపురుషులు ఉంటారు
"పంట"నొక్కెయ్యాలని "కాపుగాసి"


13, మే 2019, సోమవారం

హా!వకాయ.

ఆవకాయ 
బాగా కుదిరితే
'ఆబ'కాయ
కారమెక్కువైతే 
'హా'వకాయ. 

12, మే 2019, ఆదివారం

దూరం త్రీ ఫీటు.

ఎండాకాలం క్రమంగా 
పెరుగుతోంది హీటు 
మధ్యాహ్నం చూడగా 

కర్ఫ్యూ స్ట్రీటు 
రోజంతా 

చెమట స్నానాల హేటు
సన్నిహితుల మధ్యకూడా

 దూరం త్రీ ఫీటు.

9, మే 2019, గురువారం

భూమాత చెమట బొట్టు

భూమాత జీవుల్ని మోస్తూ 
తిరుగుతోంది సూర్యుని చుట్టూ
సప్తసముద్రాలయ్యాయనుకుంటా
చిందిన స్వేదం బొట్టూబొట్టూ.

8, మే 2019, బుధవారం

గాలి చెలి ఒడిలో

ఎండకు తిరిగి అలసినప్పుడు
చల్లని "గాలిచెలి" స్పర్శతో
సేదతీరి, మేఘుడు రాల్చిన
ఆనంద బాష్పాలు ఈ చినుకులు.

7, మే 2019, మంగళవారం

మేఘాల కన్నీళ్లు

గాలి ఈడ్చి కొడితే
కొండను కావలించుకొని
కన్నీళ్లు కారుస్తాయ్ 
మేఘాలు.

6, మే 2019, సోమవారం

వర్షపు విత్తనాలు

సూర్యుడు ఎండాకాలం
మేఘాలను దున్ని
వర్షపు విత్తనాలను
"జల్లు"తూ ఉంటాడు.

5, మే 2019, ఆదివారం

రంగు "చుక్కలు".

లోకపుకప్పుకు చంద్రుడు
వెన్నెలరంగును వేస్తుంటే
ఆకాశపు నేలపై బడిన
బొట్లు ఈ "చుక్కలు".

"వాన" రమ్మని.

అల్లరి వాడిని పిలుస్తారు
"వానరమ్మని"
వాడిని ఆటలకు పిలుస్తోంది
"వాన" రమ్మని.

3, మే 2019, శుక్రవారం

ఏరు "వాక్"

'వెలుగుల' అన్నం ముద్దను
విసిరి కొట్టి, తీరిగ్గా
'మెతుకులను' ఏరు "వాక్"
చేస్తున్నాడు 'నెలబాలుడు'.

2, మే 2019, గురువారం

సూర్యహారతి

ప్రకృతి మాతకు దేవతలు ఎన్ని యుగాలనుండి పడుతున్నారో "సూర్యహారతి" ఆకాశం కప్పు, అలా నల్లబడి ఉంది.

1, మే 2019, బుధవారం

సొమ్మ "సిల్లీ"

ఎండాకాలం
ఉక్కబోస్తుందంటావెం! "సిల్లీ"
గాలికూడా
పడిపోయిందిగా, సొమ్మసిల్లి.