28, నవంబర్ 2020, శనివారం

ఆ "కట్టు"కుంటోంది

 

నాగరికత పె(త)రిగి
ఆ "కట్టు"కుంటోంది మారి
"కొద్దిగా కనబడని" నుండి
"ఆ కొద్దిగా కనబడని" వరకు.


26, నవంబర్ 2020, గురువారం

రో! దించటం


 "మత్తు"లలోకి శరీరాన్ని
ఎందుకురో! దించటం
అన్నివిధాలా నాశనమై
ఎందుకు రోదించటం.

25, నవంబర్ 2020, బుధవారం

"పెద్దమనుషులై"కూడా.

 

కొందరు -

చిన్నతనం కాకున్నా
చిన్నతనం లేకుండా
చిన్నతనపు దుస్తులతో
"పెద్దమనుషులై"కూడా.


19, నవంబర్ 2020, గురువారం

వదులు పట్టు

 

అందరికీ కావాలి హక్కులు
బాధ్యతలంటే చూస్తారు దిక్కులు
వాటికివదలరు గట్టిపట్టు
వీటికి "వదులు" - వట్టిపట్టు.


18, నవంబర్ 2020, బుధవారం

"నలుగు" రివ్యూ.

 

"సెలబ్రిటీ"వైతే
నీమీదే నలుగురి "వ్యూ"
కొంచెం "తేడా"వస్తే
మీడియాతో "నలుగు" రివ్యూ.

15, నవంబర్ 2020, ఆదివారం

"హలో"చించి

 


తెలివున్నవాళ్ళు
ఆలోచించి మాట్లాడతారు

"సెల్" ఉన్న వాళ్ళు
"హలో"చించి మాట్లాడతారు.

13, నవంబర్ 2020, శుక్రవారం

ఆ "పన్నులను"

 

ఆ "పన్నులను"
చెల్లించడం మన బాధ్యత
ఆపన్నులను
రక్షించడం "హరి" బాధ్యత.


11, నవంబర్ 2020, బుధవారం

గూట్లోకి

 

గూట్లోకి నెట్టి
వేశారు మూత

గరుడపురాణం తోటి
భగవద్గీత.

"గొట్టం" గాళ్ళ


 కొందరు "గొట్టం" గాళ్ళ
"షాక్" ట్రీట్ మెంట్లు

"యూట్యూబ్" చూసేవాళ్ళ
తలకెక్కిందా "మెంటలు"

కరోనాను ఆపలేరు

 

అరచేతిని అడ్డుపెట్టి
కరోనాను ఆపలేరు
చేతుల శుభ్రం
మాస్కుతో తప్ప.




7, నవంబర్ 2020, శనివారం

"ఫుట్" మచ్చ

 

ఆ అన్న కోరిక
పుట్టాలని "పుట్టుమచ్చ"గా
తన తోడబుట్టిన
చెల్లికి "ఫుట్" మచ్చగా.


6, నవంబర్ 2020, శుక్రవారం

3, నవంబర్ 2020, మంగళవారం

మానవా! మానవా

 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా...కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివొల్యూషన్" సంస్థ... వారు నిర్వహించిన పాటల పోటీలో ఎంపిక అయి పాటల సంకలన పుస్తకములో అచ్చయిన "గేయము". 


మానవా! మానవా

మానవా మానవా అహంకారం మానవా
జీవులన్ని ఉంటేనే నీకు జీవితం వినవా  


అన్నింటిని మింగేస్తే అన్ని నిన్ను మింగేస్తయ్
ఒక్కడివే ఉండాలంటే తొక్కిపాతరేసేస్తయ్
వాటి ఉసురు తగిలితే కాటికెళ్ళి పోతావూ
చెట్టులన్ని నరికేస్తే చేటు గలిగి చస్తావూ   :మానవా:

జంతువులు పక్షులే దేవుళ్ళకు  వాహనాలు
ఆకాశంలో చూస్తే అవేకదా రాశులు
పాలసముద్రమ్మునే పట్టి చిలికితేనూ
పుట్టిందీ ఏనుగూ గుర్రము చెట్టేనూ :మానవా:  

దేవుడి అవతారాలైనా ముందు ఎలా పుట్టాడూ
చేపగ తాబేలులా వరాహమంటు నిలిచాడూ
తరువాతే భూమి నిలచి జీవమంత పుట్టింది
పాముగదా ఈ భూమిని పడగలపై పట్టింది   :మానవా:

ప్రకృతినే ఎదిరిస్తే వికృతమై పోతావు  
జీవులవైవిధ్యముంటె జీవిక సాగిస్తావు
ప్రాణులు నాశనమవక బాధ్యతగా జీవించు  
ప్రేమ పంచు పోషించు జీవనమిక సాగించు :మానవా:

2, నవంబర్ 2020, సోమవారం

తిన "లేని" వారు

 

కడు పేదవారు
తిన "లేని" వారు
కడుపు "పెద్ద"వారు
తినలేని వారు.


1, నవంబర్ 2020, ఆదివారం

సైంధవులు.

 

కరోనా పోయిందంటూ
తీసుకోకుంటే జాగ్రత్తలు
ఔతారు సైసై అంటూ
గంతులు వేసే సైంధవులు.