26, ఏప్రిల్ 2020, ఆదివారం

ముప్పెన

కరోనా ఉప్పెనలా
అలలా వచ్చి అలా వెళ్ళలేదు
అలా అలా వచ్చి
అలానేఉంది "ముప్పెనలా"
23, ఏప్రిల్ 2020, గురువారం

"బంద్"వులం.

కరోనా "చుట్ట"రికం
ఒక్కటయ్యింది ప్రపంచం
ఇప్పుడు అందరం
దూరపు "బంద్"వులం.


20, ఏప్రిల్ 2020, సోమవారం

'చే 'తల ' రాతలు

కళ్ళూ, ముక్కూ, నోరు
ఇలా 'చేతుల'తో ఒకటే పోరు
"మారతాయి జాగ్రత్త 
మీ 'చేతల 'చే 'తల ' రాతలు." 

కన్నీటి చెరువులు

నడుస్తూ వందల కిలో మీటర్లు
కన్నీళ్ళు కారుస్తున్న కాళ్ళు
ఎదురుచూస్తూ గుండె చెరువులై
వలస కూలీల ఇళ్ళు.

18, ఏప్రిల్ 2020, శనివారం

'హ్యాండ్స్ షేక్'

నిన్నటి దాకా
మనిషి ఎదురైతే చాలు
'షేక్ హ్యాండ్'
నేడు 'హ్యాండ్స్ షేక్'

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

"నమస్కారం" చెయ్యి.

ఓ చెయ్యీ! ఆ చెయ్యి 
ఎన్ని "చెడుతిరుగుళ్ళు" తిరిగిందో 
నీకోసం వస్తే "పట్టించుకోక" 
ఓ "నమస్కారం" చెయ్యి.   

16, ఏప్రిల్ 2020, గురువారం

మందు(ద)లిచ్చు

అంటకుండా అంటురోగం
మందులిచ్చేవారికి
మందలిచ్చేవారికి
అందరికీ నమస్కారం.


15, ఏప్రిల్ 2020, బుధవారం

పొత్తిళ్ళు.

ఇప్పుడివి కావు ఇళ్ళు
తమ సంతానాన్ని
అక్కున జేర్చుకున్న
కన్న తల్లి పొత్తిళ్ళు.


14, ఏప్రిల్ 2020, మంగళవారం

"మంట".

చేతులు కడగమంట
'దూరం' పాటించమంట
"శుభ్రంతో" పుట్టించమంట
'కరోనా'ను కాల్చే "మంట".

13, ఏప్రిల్ 2020, సోమవారం

కలి - కరోనా

కాళ్ళు సరిగా కడగనంతవరకు వేచి
నలుణ్ణి పట్టాడట "కలి" స్వయానా
చేతులు సరిగా కడగకుంటే చూచి
నరుణ్ణి పట్టేస్తుందిక "కరోనా".

12, ఏప్రిల్ 2020, ఆదివారం

ఆచారం

నిన్నటి ఆచారం 
చుట్టమొస్తే కాళ్ళకు నీళ్ళివ్వటం
రేపటి ఆచారం
చేతులకు శానిటైజర్, సబ్బివ్వటం.

వి(వీ)ధులు

ఈ 'కరోనా' యుద్ధ సమయంలో
ఇళ్ళల్లో ఉండేవాళ్ళు మనుషులు
విధుల్లో మునిగేవారు దేవుళ్ళు
వీధుల్లో మూగేవారు రాక్షసులు.

11, ఏప్రిల్ 2020, శనివారం

తల్లి కోడి

ఇప్పుడు ప్రతి ఇల్లు
గ్రద్దను చూసి పిల్లలను
రెక్కల్లో పొదువుకుని
తలెత్తుకున్న తల్లి కోడి.

9, ఏప్రిల్ 2020, గురువారం

"సెల్ఫీ"

ముద్ద "బంతి"లా
అందంగా ఉందని
"సెల్ఫీ" దిగాలనుకోకు
అది "కరోనా".

8, ఏప్రిల్ 2020, బుధవారం

భస్మాసురుడు.

ఇప్పుడు 
బయటికెళ్ళే ప్రతివాడూ 
ఎదుటివాడికి 
ఒక భస్మాసురుడు.

చేతుల గుసగుసలు.

"మనమీద శ్రద్ధ"- కుడిచేయి
"కాదు అనుమానం" - ఎడమచేయి
తరచూ కడుగుతుంటే
చేతుల గుసగుసలు.

6, ఏప్రిల్ 2020, సోమవారం

2, ఏప్రిల్ 2020, గురువారం

వెనకడుగు.

చేతులు బాగా కడుగు
బయటకు వేయకు అడుగు
దూరం బారెడు పొడుగు
'కరోన' వేస్తుంది వెనకడుగు.