28, మార్చి 2020, శనివారం

ఎ 'వరెస్టులు'.

జీవితమంటే 
ఎదురొచ్చే టెస్టులు
ఊహించని ట్విస్టులు
వరెస్టులు ఎవరెస్టులు. 

24, మార్చి 2020, మంగళవారం

"దూరాచారం"

"కరోనా" రాక్షస సంహారం
చేయడానికి ప్రవచనం

శుచి అంటే కేవలం
అనుకోకు విప్రవచనం
అనుకున్నాసరే "చాదస్తం"
"వైరసురుని"పై చేదు అస్త్రం

మానేద్దాం కరచాలనం
చాలు చిరునవ్వు, నమస్కారం
చేతుల శుభ్రత నిరంతరం
ముఖానికి "మాస్క్" నియంత్రణం

అనుకోక దురాచారం
సామాజిక "దూరాచారం"
అందరం పాటిద్దాం
కరోనాను తుదముట్టిద్దాం.


21, మార్చి 2020, శనివారం

"కోవిడ్"లు

నిన్నటి దాకా
ఫారెన్ రిటర్న్స్
"కోవిదు"లు
నేడు "కోవిడ్"లు.

19, మార్చి 2020, గురువారం

కరోనా "మడి."

ప్రపంచం చెబుతోంది
అందరికీ "ఉమ్మడిగా"
కరోనా "తాకకుండా"
ఉండాలని "మడిగా."

18, మార్చి 2020, బుధవారం

అంటు, రోగాల "కుదింపు".

షేక్ హ్యాండ్. కిస్సుల పలకరింపు
అంటు రోగాలకు "దింపు"
నమస్కారం, చిరునవ్వుల చిలకరింపు
అంటు, రోగాల "కుదింపు".


16, మార్చి 2020, సోమవారం

కరోనా 'మైల'

కరోనా 'ముట్టు'
దూరం మూడు గజాలు
కరోనా 'మైల'
పద్నాలుగు రోజులు.

6, మార్చి 2020, శుక్రవారం

అడ్డ 'గోల్'

నీ ప్రయాణం సాగాలి
ధర్మపు అడ్డా 'గోల్' గా
కానీ జాగ్రత్త - వస్తుంటారు
కొందరు 'అడ్డగోల్' గా.

1, మార్చి 2020, ఆదివారం

'రేప్ పల్లె'

నాడు వ్రేపల్లెలో కృష్ణుని చేత చచ్చి
నేడు మళ్ళీపుట్టారు అసురులు రూటు మార్చి 
నేడు ప్రతి ఊరూ  'రేప్ పల్లె' చూడమ్మా 
పుట్టిన ప్రతి ఆడపిల్ల వారికి  ఓ కృష్ణమ్మ
ఓయమ్మా! వారిని జాగ్రత్తగా కనిపెట్టుకోమ్మా! 
పాలుత్రాగే వయసులో పట్టుకుపోయే 
మగ పూతనలు వస్తారు   
పారాడే వయసులో ఎత్తుకు త్రిప్పుతాననే
శకటాసురులు వస్తారు
నడిచే వయసులో గడ్డి తినే బుద్దిగల 
తృణావర్తులు ఎదురౌతారు
చదువుకునే వయసులో ఎద్దులాపడాలని
వత్సాసురులు చూస్తారు
యవ్వనం లోకి రాగానే
కొంగజప బకాసురులు నోరుతెరుస్తారు
ఆదమరిస్తే నడివయసైనా
కొండచిలువలా చుట్టెయ్యాలని అజగాసురులు తయ్యారు
పెద్దవయసైనా గాడిదబుద్ధితో
గాడితప్పే ధేనుకాసురులు హాజరు 
ఎప్పుడూ ప్రక్కనే ఉంటూ  పక్కజేరాలని 
ప్రలంబాసురులు ప్రాకులాడుతుంటారు
ఒక్కటే అందరి ధ్యేయం
ఆదమరిస్తే హత్యాచారం   
మానమంటే తెలియని మానహీనులు
మానమంటే ఆపని  మాననివారు
మానని గాయంచేసే మానవమృగాలు
ఓ అమ్మా కృష్ణమ్మను
జాగ్రత్తగా కాపాడుకోమ్మా!