27, ఫిబ్రవరి 2012, సోమవారం

'అ'మూల్య మైనవి

అపౌరుషేయము లైన 
మన వేదములను సరిగా 
అర్థము  చేసుకుంటే 
అమూల్య మైనవి 

అపౌరుషముగా
తగిన జ్ఞానము నేర్వక 
అపార్థము చేసుకోవటం వల్ల
'అ'మూల్య మైనవి. 

22, ఫిబ్రవరి 2012, బుధవారం

'కల' కలము

కదన రంగంలో 
కదలి సృష్టి స్తుంది
వీరుని చేతి  కత్తి
కలకలము

కవన రంగంలో   
చరిత్ర సృష్టి స్తుంది 
తీరైన  వాని చేతిలో   
కల  కలము   

20, ఫిబ్రవరి 2012, సోమవారం

నా 'శం' కరుడు

వాక్కులు తానే పుట్టించినా 
మౌన వ్యాఖ్యతోనే 
ఎన్నింటినో  తెలిపే  
వాడు  నా  శంకరుడు 

చిక్కులు ఎన్ని చుట్టు ముట్టినా 
మౌనంగా ధ్యానిస్తే 
అన్నింటిని దులిపే 
భవ నాశం  కరుడు. 

16, ఫిబ్రవరి 2012, గురువారం

ఎందు'కోయిలా'

చక్కగా పాటలు పాడి 
అబినందనలు పొందుతున్న   
ఓ  కోయిలా!

పిల్లల పెంపకం  
వదలి నిందలు పొందుతున్నావు 
ఎందుకో  యిలా?

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ముందడుగు

ముఖ్యమైన  పనికి 
వేయాలంటే 
ముందడుగు 

మనసునో 
మనసైన వారినో 
ముందడుగు.



7, ఫిబ్రవరి 2012, మంగళవారం

సం'పద'

న్యాయంగా ఆర్జిస్తూ 
ధర్మంగా జీవిస్తూ
పొదుపుగా వుంటూ 
పెంచుకో  సంపద.

ఆనందాన్ని పంచుతూ  
ఆలుబిడ్డల పోషిస్తూ
పరుల సుఖం  కోరు కుంటూ 
నలుగురి కోసం పద. 


5, ఫిబ్రవరి 2012, ఆదివారం

లో'గిలి'

భగవంతునికి 
నెలవైతే మన 
మనసు   లోగిలి 

బ్రతుకు పోరాటానికి 
ఉంటుందా మన 
మనసులో   గిలి.



4, ఫిబ్రవరి 2012, శనివారం

పెట్టకు 'వేలు'

అనవసరమైన
విషయాల్లో 
పెట్టకు వేలు 

అవసరం లేని
ఆడంబరాలకు 
పెట్టకు 'వేలు'. 







3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఏ'కాకి'

పరులకు సాయం 
చేయని వాడు
పరమాత్మ తోడు లేని 
ఏకాకి 

పర లోకం వెళ్ళినా
వాడి పిండం ముట్టి 
చేయదు సాయం
ఏ  కాకి.











2, ఫిబ్రవరి 2012, గురువారం

చేయి'కాలు'

 పనులు 
చేయాలంటే 
అవసరం 
చేయి, కాలు

అనవసర మైన 
పనులు 
చేశావంటే 
చేయి కాలు.