29, ఏప్రిల్ 2012, ఆదివారం

నీ కో 'వెల'


సర్వాంతర్యామీ!
 నీవు గుడిలోనే
ఉన్నావని భావిస్తే
దర్శనానికి
అక్కడిదాకా వెళ్ళి 
చెల్లించాలి
నీకో వెల

అనుకున్నదే తడవు
నీ ఉచిత దర్శనానికి
అనువుగా
 నా గుండెనే 
చేసుకోరాదా
నీ  కోవెల.

10, ఏప్రిల్ 2012, మంగళవారం

అమ్మా'యెందుకని'

అమ్మలూ...
కడుపునున్న గ్రుడ్డుపై 
మీకు దయలేదా? 
ఆడ శిశువును 
పుట్టకముందే 
పుట్టి ముంచుతున్నారు
అబ్బాయి చాలు 
అమ్మాయెందుకని


అమ్మలూ...
కడుపున  నున్న నీవైనా 
అమ్మను అడగలేవా?
నీవు కూడా ఆడదానివే కదా
నీ తల్లి నిన్ను కన్నది కదా  
నామీద కక్ష 
అమ్మా!  యెందుకని.

8, ఏప్రిల్ 2012, ఆదివారం

చిన్న బాల ' శిక్ష '

తెలుగు  నాట  నా డు   
బడులలో బుడుగులకు 
తెలుగు నాటు టకు                      
బోధించే వారు 
చిన్న బాల శిక్ష 
పెద్ద బాల శిక్ష 


తెలుగు నాట నేడు 
కాన్వెంటులలో టీచ(జ)ర్లు 
'నాట్ తెలుగు' అంటూ 
బాధిస్తూ వేస్తున్నారు 
చిన్న బాలలకు పెద్ద శిక్ష.

1, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ రామా ! నీ చరితం

శ్రీ రామా ! నీ చరితం 
సకలగుణ సా(గ)రం 
ఎవరేది వెతికితే 
అదే లభిస్తుంది.
దొరక లేదా 
ఒకరికి కల్పవృక్షం 
మరొకరికి విషవృక్షం
ఏదో ఒక రకంగా 
నీ కథా సాగరం లో 
మునక వేసిన వారికి
తప్పక ఇస్తావు మోక్షం.