27, ఏప్రిల్ 2024, శనివారం

వేలుచుక్క

 "వేలుచుక్క" పొడిచే సమయం

సరిగా "మేలుకొని"

నీ"కర్తవ్యం" నిర్వర్తించు

అవుతుంది ప్రజాస్వామ్యానికి "శుభోదయం"


"వేలు" "చుక్క"ల లెక్కలేస్తూ  

కనులు "మూసుకొనే" ఉన్నావా

నీ తెలివి "తెల్లారినట్టే" 

శుభోదయానికి "చీకటి" అడ్డుకట్టే.  

 


25, ఏప్రిల్ 2024, గురువారం

ఫీలింగ్

 ఇప్పటి పిల్లులు

"ఫీలింగ్" వదిలేశాయ్ 

కళ్ళు తెరుచుకునే

"పాలు" తాగుతున్నాయ్. 

24, ఏప్రిల్ 2024, బుధవారం

"వంక" ర

 

మనం గీస్తే
"వంకర" గీతలు
వాటి "వంక" చూడలేం

"బాపు" గీస్తే అవి
"వంక" లేని గీతలు
"బాపురే" అనకుండా ఉండలేం.


22, ఏప్రిల్ 2024, సోమవారం

శాంతి వనం

 21-04-2024 న అమరావతి సాహితీ మిత్రులు సభలో 

"ప్రపంచ శాంతి" అనే అంశం పై  చదివి ప్రశంస మరియు సత్కారం పొందిన కవిత. 


శీర్షిక: శాంతి వనం. 


పరచుకొని ఉంటే ప్రపంచ శాంతి   

కొన్నిదేశాలకు ఉండదు మనశ్శాంతి    

  

ఐదు వేళ్ళూ నోట్లోకి పోని దేశమైనా 

ఆయుధాలు మాత్రం పోగేసుకుంటుంది  


ప్రక్క దేశంపై పెంచుకుంటుంది పగలు  

నిద్ర లేకుండా చేస్తుంది రాత్రీ పగలు  


అందుకే పెద్దరాజులు  మంటలు రాజేస్తూ ఉంటారు 

ఒకడికి వెన్నంటి మెత్తగా వెన్నంటి మాటలు చెప్తారు 


సాయం చేస్తూ  మిత్రుడిలా అంట కాగుతారు 

తమ దగ్గరి ఆయుధాలను అంటగడతారు    

 

ఇరు దేశాల మధ్య వచ్చే "ఢీ" పావళి 

ఆయుధ టపాసుల వ్యాపారులకి "దీపావళి"    


యుద్ధమంటే అది భూమికి కడుపు మంటే

జరిగే మారణ హోమం భావితరాలకు విష ధూమం  


అణుబాంబులను పండించి గాదెలలో నింపటమంటే 

అగ్ని పర్వతంపై మానవజాతిని నిలబెట్టడమే  

 

పంచభూతాలతో చెలగాటమాడటమంటే    

ప్రపంచ భూతాలుగా మారి  వినాశం తెచ్చుకోవడమే   

  

ఇప్పటికైనా మూర్ఖపు  ఉగ్రవాదాన్ని వీడాలి

ముప్పుతెలిసి యుద్ధోన్మాదాన్ని వదలాలి 


కలసి మెలసి ఉంటుంటే కంచెలతో పని ఉందా   

భాయి భాయి అనుకుంటే ఆయుధాలు అవసరమా    


గత చరిత్రలో తగిలిన గాయాలను తలచుకోవాలి 

మన ధరిత్రిని శాంతి వనంగా మలచుకోవాలి  


ఇది తెలుసుకొని మానవ లోకం మెలగాలి

నవ శకంతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి.       

 




21, ఏప్రిల్ 2024, ఆదివారం

దే(హ)శ భక్తి

 అమరావతి సాహితీ మిత్రులు

వారం వారం వచన కవితల పోటీలు-3 నందు ప్రశంస పొందిన కవిత.

అంశం : దేశ భక్తి
శీర్షిక: దే(హ)శ భక్తి
దేశమా!
నీ కులమేదో చెప్పు
ఒంటికి హత్తుకుంటాం
నీ మతమేదో చెప్పు
నెత్తికెత్తుకుంటాం
నీ పార్టీ ఏదో చెప్పు
జెండా పట్టుకుంటాం
నీవు నాకు ఏమౌతావో చెప్పు
అక్కున చేర్చుకుంటాం
నీవు నాకు ఏమిస్తావో చెప్పు
దండం పెట్టుకుంటాం

దేవుడైనా, దేశమైనా
కులమో, మతమో, పార్టీనో,
బంధమో, అనుబంధమో
లేకుంటే ఎలా?

అయినా, జెండా ఎగరేసి
మా "కర్మ"ను మరువకుండా
ఏడాదికి రెండు "దినాలు"
పెడుతున్నాం దండాలు
ఇది "దేశభక్తి" కాదంటావా?

"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్"
మేమే కదా ఈ దేశం
మా "దేహ" భక్తియే "దేశ భక్తి"

15, ఏప్రిల్ 2024, సోమవారం

ముద్దౌతాడు

 

తన శ్రమలో
చెమటతో
తడిసి ముద్దౌతాడు

ఆకలిగొన్న
భూజనులకు
అన్నం ముద్దౌతాడు

అందుకే రైతు
పుడమితల్లికి
ఎంతో ముద్దౌతాడు.



14, ఏప్రిల్ 2024, ఆదివారం

కష్టమర్

 "కష్టమర్" కి 

కష్టం వచ్చి

"కేర్ కేర్" మంటే 

కష్టాన్ని మరిపించేదే   

"కష్టమర్ కేర్" సెంటర్. 




దేవతార్చన

 అమరావతి సాహితీ మిత్రులు 

వారం వారం వచన కవితల పోటీలు - 2 నందు ప్రశంసను పొందిన కవిత. 

అంశం : రైతు

శీర్షిక: దేవతార్చన 


సూర్యుడు కాల్చినా బెదరనివాడు  

వర్షం తడిపినా దడవనివాడు

చలి పులి కొరికినా వణకని వాడు


వేకువ కోడితో పోటీపడి లేచి

తన దేవాలయ క్షేత్రానికి వెళతాడు  

భూదేవిని తన పొలంలో ఆవాహన చేస్తాడు 

నాగలితో నమస్కరిస్తాడు 

అరకతో అర్చన చేస్తాడు

విత్తనాల అక్షతలు చల్లుతాడు

తన శ్రమను నైవేద్యంగా సమర్పిస్తాడు

పంట వరాల కోసం ప్రకృతిమాత వైపు  

ఆకాశం కేసి చూస్తూ ఉంటాడు


వరాలిచ్చినా ఇయ్యకపోయినా

దేవతార్చన వదలని అర్చకుడు అతడు

భక్తులకు ప్రసాదం అందించి 

తన బాధ్యత అని తృప్తిపడే పూజారి అతడు

పళ్ళెంలో చిల్లరే తన ప్రాప్తమనుకుంటాడు 

ఎదురుగా ఎన్నో రుసుములు హుండీలలో నోట్లు 

ఎవరైనా గుర్తించక పోతారా అనుకుంటాడు తన పాట్లు 


అతని బ్రతుకు మారితే 

తన అర్చనకు ఎగనామం పెడతాడనేమో

దేవుడు కూడా అతన్ని అలాగే ఉంచుతున్నాడు


ఆ రైతు బాగుంటేనే వ్యాపారికి మజా మజా    

ఆ పూజారి కోలుకుంటేనే లోకానికి పొట్టపూజ 



  

13, ఏప్రిల్ 2024, శనివారం

"నిల్"బడి

 మనుషుల్లో

రెండే రకాలు

చరిత్రలో
"నిలబడి పోయేవారు"
"నిల్"బడి "పోయేవారు"


12, ఏప్రిల్ 2024, శుక్రవారం

భూమాత నగలు

 అమరావతి సాహితీ మిత్రులు 

వారం వారం వచన కవితల పోటీలు - 1 నందు ప్రశంసలు పొందిన కవిత.  

అంశం : నగరాలు

శీర్షిక: భూమాత నగలు


చెరువులను మింగేస్తూ,  చెట్లను నమిలేస్తూ 

కొండలను కొరికేస్తూ, గ్రామాలను ముంచేస్తూ

ముందుకు ముందుకు, పైపైకి ‘ఎత్తు’కు పోతుంటాయి    

పచ్చపచ్చని చూపులను ‘ఎత్తుకు’ పోతుంటాయి      


పలకరింపులు నోచుకోని, వేలవేల జనాలతో

ప్రయాణానికి ఇరుకైన, సువిశాల రహదారులతో 

వెలుగుల జల్లులు చల్లుతూ చల్లగా  ఆహ్వానిస్తుంటాయి 

క్షణం ‘తీరిక’ లేకుండా మా ‘తీరి’క ఇంతేనంటుంటాయి  


బాగా ఉన్న వారికి చచ్చేంత సుఖమిచ్చే స్వర్గ ధామాలు

ఏమీ లేనివారికి తప్పని బ్రతుకిచ్చే నరక కూపాలు  

అందరినీ ఆకర్షించే అద్భుత అయస్కాంతాలు

జేబులకు వేస్తుంటాయి కళ్ళకు కనబడని కంతలు


ఒక క్షణం భూమి కంపిస్తే గజగజ వణికి పోతుంటాయి 

ఒక గంట వాన కురిస్తే గుండెలు చెరువులైపోతుంటాయి  

ఒక పూట విద్యుత్తు ఆగిపోతే ఊపిరి ఆగినట్లైపోతుంటాయి      

ఒక రోజు నీళ్ళు రాకపోతే ఊరకే నీరుగారి పోతుంటాయి  


అయినా భూమాతకు పెట్టిన నగలుగా నగరాలు      

అన్నింటికీ తట్టుకొని మెరుస్తూ మురిపిస్తూ ఉంటాయి  

అందర్నీ అక్కున చేర్చుకొని భరిస్తూ నిలుస్తూ ఉంటాయి     

చీకటి వెలుగుల ఉపాధికి విస్తరి వేస్తూ విస్తరిస్తూ ఉంటాయి.


 

8, ఏప్రిల్ 2024, సోమవారం

బూతర్థాలు

 


నచ్చినవారి
బూతులకు నీట్ అర్థాలు

నచ్చనివారి
నీతులకు బూతర్థాలు

వెతుకుతూ
చేతిలో భూతద్దాలు.


7, ఏప్రిల్ 2024, ఆదివారం

లేకపోతే


చేతికి ఎముక లేకపోతే
అందరూ మెచ్చుకుంటారు
నాలుకకు నరం లేకపోతే
అందరూ తిట్టుకుంటారు.

4, ఏప్రిల్ 2024, గురువారం

మెక్కటం

 

సింహాసనమెక్కటం
అందినంత మెక్కటం

అలా ఉండకూడదు
ప్రజలను పాలిస్తే

ఉండాలిలా 
ఎలా ఉంటుందో
అమ్మ పాలిస్తే


31, మార్చి 2024, ఆదివారం

"పుచ్చు" కొన్నంత

 వస్తోంది

"వేలుచుక్క" పండగ

 అందిస్తుంది

వేలు, చుక్క నిండుగ

"పుచ్చుకొన్న" వాడికి

"పుచ్చు" కొన్నంత



29, మార్చి 2024, శుక్రవారం

ప్రై'వశీకరణం'


అవతలి వారికి
తెలియకుండా మనమాటను వినేట్టు చేస్తే వశీకరణం వారి మాటలను వినాలని చూస్తే ప్రైవసీకరణం.

24, మార్చి 2024, ఆదివారం

"ఈ.డి" చి

 

అక్రమ సంపాదన
"హనీ" కాదు "హాని"
కాలం మారి ఎప్పుడో
"ఈ.డి" చి కొడుతుంది.


15, మార్చి 2024, శుక్రవారం

అ(రి)ప్లై

 అవసరమైన మాటలకే  

నోరు "అప్లై" చేయి 

అనవసరమైన వాటికి 

"నో రిప్లై" హాయి. 

2, మార్చి 2024, శనివారం

కాలం చేతలు

 

ఏదో చేద్దామనుకుని
ఏమీ చేయలేకపోవటం
ఏమీ చేయలేమనుకొని
ఏదో చేసేస్తుండటం
కారణం
కాదు కాళ్ళూచేతులు
అది కాలం చేతలు.

26, ఫిబ్రవరి 2024, సోమవారం

పిడి

 శ్రమతో సాధిస్తే

ఫలితం "పసిడి"  

అదిలేకుంటే 

జీవితం "చప్పిడి"

దోపిడీ చేస్తే

పడుతుంది "పిడి"

 


20, ఫిబ్రవరి 2024, మంగళవారం

"ప్రేమ"

 

"ప్రేమ"
కొనలేనిది
దాచుకొనలేనిది
కోరలు లేనిది
బదులు కోరనిది.

10, ఫిబ్రవరి 2024, శనివారం

సోషల్ మీడియా

 

సోషల్ మీడియా
ఎంతో విశాల్ మీడియా
దొంగ వేషాల్ మీడియా
పలు దోషాల్ మీడియా
కొందరి రోషాల్ మీడియా
మరికొందరి ద్వేషాల్ మీడియా
కీ.శే.లకూ ఆత్మఘోషల్ మీడియా
మంచి పంచితే కుశాల్ మీడియా
సరిగ ఉంటే సంతోషాల్ మీడియా


27, జనవరి 2024, శనివారం

ఉత్త "ముండే"


 వాడు మనతో
"క్లోజ్" గా ఉంటే
"ఉత్తముండే"
"గ్యాప్" వచ్చిందా
ఉత్త "ముండే"


16, జనవరి 2024, మంగళవారం

కాగితం ముక్క

 ఛీకొట్టి విసిరేస్తే 

రోషంతో ఒళ్ళును 

విల్లులా విరుచుకున్న

చీపురుపుల్లని 


చిత్తుగా నలిపేస్తే 

ఎత్తుకెదగాలని 

వివేకం పరుచుకున్న

కాగితం ముక్క


తనతో కలుపుకొని

భుజాలకెత్తుకుంది  

"సూత్రం" తెలిసిన 

"సూత్రధారుని"తో 

కలిసి "సాగి"పోయింది


ఆకాశానికెగిరింది

ఛీకొట్టిన వారే 

పొగడగా జై కొడుతూ 

చిత్తు అన్నవారికి

ఎత్తుగా కనబడుతూ.



15, జనవరి 2024, సోమవారం

క్షేమకర సంక్రాంతి

 మనసుగదిలో ఆలోచనల అటకపై

దాచిన పనికిరాని వస్తువులు

చేదుజ్ఞాపకాలు, గ్రుడ్డి అనుమానాలు, 

అకారణ ద్వేషాలు, ప్రతీకార తలపులు  


మరపు అనే భోగిమంటలో

వాటిని వేసి, చేసిచూడు మసి

బ్రతుకున ఎదురౌతుంది

క్షేమకర మకర సంక్రాంతి  


14, జనవరి 2024, ఆదివారం

మీలో గిలి

 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.


భోగి మంటల వేడితో
పోవాలి చలితోపాటు మీలో గిలి
భోగ భాగ్యాల వెలుగుతో
నిండిపోవాలి మీ లోగిలి.


8, జనవరి 2024, సోమవారం

గాలిపటాలు


అక్వేరియంలో
అందంగా కదులుతున్న
రంగురంగుల చేపల్లా ఉన్నాయి
నీలాకాశంలో గాలిపటాలు.

6, జనవరి 2024, శనివారం

మంచి నేర్పు


నీవు చేసే పనిలో
సాధించు మంచి "నేర్పు"
పనిలోపని సమాజానికి
ఏదో ఒక "మంచి" నేర్పు.


2, జనవరి 2024, మంగళవారం

అలా వాటు

 దురలవాటు

వేసుకుని అలా వాటు
అవుతుంది బలాదూర్ అలవాటు
చెయ్యాలి దాన్ని
మనం బహు దూర్ అలవాటు.