17, డిసెంబర్ 2013, మంగళవారం

అను ' కూలిస్తే '


బాధపడుతూ
తిడుతూ
కూర్చొనకు
నెరవేరకుండా
అడ్డుపడి విధి
నీ  ఆశలను  కూలిస్తే  

ఎదురు చూడు
ప్రయత్నం చెయ్  
కూలిన మోడే
మళ్ళీ చిగురించి
విరబూయవచ్చు
కాలము, దైవాలనుకూలిస్తే.


7, నవంబర్ 2013, గురువారం

యేడవకుండా

భగవంతుని ధ్యానిస్తూ
నిద్దురలేవాలి
ప్రతి ఉదయం 
సమయం యేడవకుండా

ప్రతి రోజూ గడవాలి
ఉల్లాసంగా 
ఉత్సాహంగా
హృదయం యేడవకుండా.


19, అక్టోబర్ 2013, శనివారం

మీదే



ఆతడు  ఫల్గునుడు 
బీభత్సుడు, సవ్యసాచి 
విల్లెక్కుబెడితే
ఆ విజయుని చూపు
యెప్పుడూ లక్ష్యం మీదే

ఆతని  పలుగుణములనే 
ఆదర్శముగా చేసుకొని 
సవ్యముగా సాగితే
లక్ష్యం వైపునకు
తప్పక విజయం మీదే.

17, అక్టోబర్ 2013, గురువారం

మానము

ప్రతి  మనిషి
ప్రాణము కంటే
ముఖ్యముగా

కాపాడుకోవలసినది
మానవునకు

ఉండవలసిన  మానము 

అవమానము
చెందకుండా
అభిమానధనమును 
కాపాడుకుంటూ

ఉండే వారిని చూచి 
మెచ్చుకొనక మానము.


7, అక్టోబర్ 2013, సోమవారం

వే ' మనకవి '


ఆటలాడే బాలలకు కూడా 
అర్థమయ్యేటట్లుగా

టవెలది పద్యములను
అందముగా వ్రాసిన 

ఆ వేమనకవి మనకవి

ఆ పద్యములు నేర్చుకుంటే
అలుపెరగని మన జీవన
ప్రయాణ మార్గములో
అవసరమైన సూచికలుగా

అందివస్తాయి మనకవి.




3, అక్టోబర్ 2013, గురువారం

పగలే

సాటి  మనిషిని
వెంటబడి
తరిమి తరిమి
నరికి నరికి
చంపుతున్నారు
పట్ట పగలే 

దీనికి కారణం
అనవసరంగా
ఒకరిపై ఒకరు
పెంచుకున్న
పట్టుదలలు 
రగిలే పగలే.

 

15, ఆగస్టు 2013, గురువారం

జయిం'ప తాకము'.

బ్లాగు వీక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.    

 శాంతి, సహనం
అహింస, సహజీవనం
నేర్పింది మన భరతమాత
చేతిలోని మువ్వన్నెల 
జాతీయ పతాకము.


కసి, ఈర్ష్య
ద్వేషం, అసూయ 
మనపై పెంచుకొని
కవ్విస్తున్నా పరాయి
రాజ్యాలను అనవసరంగా
జయింప తాకము.

 

12, మే 2013, ఆదివారం

'జై' లేరా !

ప్రజాధనమును  
దోచుకునే వారికి 
ఎప్పటికైనా 
జైలేరా !

ప్రజలు మనసున 

దాచుకునే వారికి 
ఎప్పటికీ 
జై ! జై ! లేరా.

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

ఏమిరా ! మా రక్ష జేయవా ?


బ్లాగు వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీరామ జయరామ జయ జయ రామ.


భక్తి తోనూ బాధతోనూ 
ఒకే మాట పలుకుతుంది
నిజమైన భక్తులకు

భక్తితో పలికితే
ఏమి రామా ! రక్ష జేయవా ? 

బాధతో పలికితే
ఏమిరా ! మా రక్ష జేయవా ? 

11, ఏప్రిల్ 2013, గురువారం

ప్రతి రోజూ ఉగాదే.

బ్లాగు వీక్షకులకు శ్రీ  విజయ నామ సంవత్సర  శుభాకాంక్షలు.

భక్ష్య, భోజ్య
చోహ్య, లేహ్య ములతో
వడ్డించిన విస్తరి కాదు 
జీవితం
అనుకుంటే
ప్రతి రోజూ నిరాశే.

చేదు,  తీపి 
వగరు, పులుపు
ఉప్పు, కారం
కలిపి


వడ్డించిన విస్తరి
జీవితం
అనుకుంటే ప్రతి రోజూ ఉగాదే.

7, ఏప్రిల్ 2013, ఆదివారం

ఆ పన్నులను


పెంచటమేగాని
తగ్గించటం జరగదు
ఏ ప్రభుత్వమైనా
ఈ పన్నులను
ఆ పన్నులను.

భగవంతుడా !
మధ్య తరగతి వారము
ఈ పన్నుల కాటునుంచి
రక్షించుమయ్యా
' ఆపన్నులను. '

28, మార్చి 2013, గురువారం

'చేదు' కో !

ఓ నరుడా !
జీవన యానంలో
ప్రతి మలుపూ
మంచికో ! చెడుకో !
తీపికో ! చేదుకో !

ఓ దేవుడా !
ఏ మలుపులోనైనా
జారి పడితే
నూతిలో ! గోతిలో !
ఆదుకో ! చేదుకో !

26, మార్చి 2013, మంగళవారం

షాక్

భగవచ్ఛక్తీ, విద్యుచ్ఛక్తీ
రెండూ మేలు చేసేవే.
వాని ' ధర్మం ' తెలియక
తప్పు చేస్తేనే ' షాక్ ' కొడతాయి.

19, మార్చి 2013, మంగళవారం

' చిలుక ' గా


మంచి కోసం తపన పడబట్టే
మొదట విషం వచ్చినా
చివరకు అమృతం దక్కింది
క్షీర సంద్రాన్ని చిలుకగా.

మంచిగా మారాలని తపన వుండబట్టే
అసహ్యకరమైన రూపం నుంచి
గొంగళి పురుగు  మారింది
సీతాకోక చిలుకగా.  

10, మార్చి 2013, ఆదివారం

' చిచ్చు'


భవ  నాశంకరా  
నీ కంట దాచావు 
భవ బంధములను 
 గాల్చు చిచ్చు 

భయ నాశంకరా 
నే చంటి వాడిని 
భయము పోయేట్లుగా 
కొట్టు చిచ్చు.

31, జనవరి 2013, గురువారం

'నగ'వు



నీ ముఖమున
యెప్పుడూ చెరగక 
మెరుస్తూ ఉంటే 
చిరు నగవు
                
పదిమందిలో
ఉన్నా నీవే
చక్కగా మెరిసే
బంగరు 'నగ'వు