14, ఏప్రిల్ 2024, ఆదివారం

దేవతార్చన

 అమరావతి సాహితీ మిత్రులు 

వారం వారం వచన కవితల పోటీలు - 2 నందు ప్రశంసను పొందిన కవిత. 

అంశం : రైతు

శీర్షిక: దేవతార్చన 


సూర్యుడు కాల్చినా బెదరనివాడు  

వర్షం తడిపినా దడవనివాడు

చలి పులి కొరికినా వణకని వాడు


వేకువ కోడితో పోటీపడి లేచి

తన దేవాలయ క్షేత్రానికి వెళతాడు  

భూదేవిని తన పొలంలో ఆవాహన చేస్తాడు 

నాగలితో నమస్కరిస్తాడు 

అరకతో అర్చన చేస్తాడు

విత్తనాల అక్షతలు చల్లుతాడు

తన శ్రమను నైవేద్యంగా సమర్పిస్తాడు

పంట వరాల కోసం ప్రకృతిమాత వైపు  

ఆకాశం కేసి చూస్తూ ఉంటాడు


వరాలిచ్చినా ఇయ్యకపోయినా

దేవతార్చన వదలని అర్చకుడు అతడు

భక్తులకు ప్రసాదం అందించి 

తన బాధ్యత అని తృప్తిపడే పూజారి అతడు

పళ్ళెంలో చిల్లరే తన ప్రాప్తమనుకుంటాడు 

ఎదురుగా ఎన్నో రుసుములు హుండీలలో నోట్లు 

ఎవరైనా గుర్తించక పోతారా అనుకుంటాడు తన పాట్లు 


అతని బ్రతుకు మారితే 

తన అర్చనకు ఎగనామం పెడతాడనేమో

దేవుడు కూడా అతన్ని అలాగే ఉంచుతున్నాడు


ఆ రైతు బాగుంటేనే వ్యాపారికి మజా మజా    

ఆ పూజారి కోలుకుంటేనే లోకానికి పొట్టపూజ 



  

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి రచనలు కవితలు అనకూడదు. ఒక చిన్న వ్యాసాన్ని ఇరవై పంక్తులలో విడదీసి చెబితే అది కవిత అనిపించుకోదు.