12, ఏప్రిల్ 2024, శుక్రవారం

భూమాత నగలు

 అమరావతి సాహితీ మిత్రులు 

వారం వారం వచన కవితల పోటీలు - 1 నందు ప్రశంసలు పొందిన కవిత.  

అంశం : నగరాలు

శీర్షిక: భూమాత నగలు


చెరువులను మింగేస్తూ,  చెట్లను నమిలేస్తూ 

కొండలను కొరికేస్తూ, గ్రామాలను ముంచేస్తూ

ముందుకు ముందుకు, పైపైకి ‘ఎత్తు’కు పోతుంటాయి    

పచ్చపచ్చని చూపులను ‘ఎత్తుకు’ పోతుంటాయి      


పలకరింపులు నోచుకోని, వేలవేల జనాలతో

ప్రయాణానికి ఇరుకైన, సువిశాల రహదారులతో 

వెలుగుల జల్లులు చల్లుతూ చల్లగా  ఆహ్వానిస్తుంటాయి 

క్షణం ‘తీరిక’ లేకుండా మా ‘తీరి’క ఇంతేనంటుంటాయి  


బాగా ఉన్న వారికి చచ్చేంత సుఖమిచ్చే స్వర్గ ధామాలు

ఏమీ లేనివారికి తప్పని బ్రతుకిచ్చే నరక కూపాలు  

అందరినీ ఆకర్షించే అద్భుత అయస్కాంతాలు

జేబులకు వేస్తుంటాయి కళ్ళకు కనబడని కంతలు


ఒక క్షణం భూమి కంపిస్తే గజగజ వణికి పోతుంటాయి 

ఒక గంట వాన కురిస్తే గుండెలు చెరువులైపోతుంటాయి  

ఒక పూట విద్యుత్తు ఆగిపోతే ఊపిరి ఆగినట్లైపోతుంటాయి      

ఒక రోజు నీళ్ళు రాకపోతే ఊరకే నీరుగారి పోతుంటాయి  


అయినా భూమాతకు పెట్టిన నగలుగా నగరాలు      

అన్నింటికీ తట్టుకొని మెరుస్తూ మురిపిస్తూ ఉంటాయి  

అందర్నీ అక్కున చేర్చుకొని భరిస్తూ నిలుస్తూ ఉంటాయి     

చీకటి వెలుగుల ఉపాధికి విస్తరి వేస్తూ విస్తరిస్తూ ఉంటాయి.


 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది