12, మార్చి 2025, బుధవారం

పిల్లలు పిల్లలు పిల్లలు

 పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు

ఇంటికి బంగరు కొండలూ 

తలిదండ్రుల మెత్తని గుండెలూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు         

  

కళ్ళు చూస్తే వెలిగేటి దివ్వెలు

బుగ్గలేమో లే గులాబీ పువ్వులు

నోటినిండా అహ బోసీ నవ్వులూ   

ఎగరలేని పసి తారాజువ్వలూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు    


నడకొస్తే కుందేటీ పిల్లలు

మాటొస్తే పూతేనె జల్లులు  

ఏడిస్తే ఆకాశం చిల్లులు 

ఆడిస్తే ఎవరెస్టూ హిల్లులు 

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు 


వదిలేస్తే తోకలేని కోతులూ  

అదిలిస్తే చాలు  బుంగ మూతులూ    

మూడొస్తే గోడమీద గీతలూ      

కనిపిస్తయ్ మోడ్రనార్టూ రీతులూ       

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు   


ఇవ్వాలీ ఎన్నెన్నో ముద్దులూ

నింపాలీ తలనిండా బుద్ధులూ 

తినిపించాలీ చిరుకోపపు గుద్దులూ 

నేర్పించాలీ మరి సుద్దులూ హద్దులూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు   


చూపించాలి సంస్కారపు దారులూ 

అందించాలి విజ్ఞానపు కారులూ    

కాకుండా ఉండాలి చోరులూ   

కావాలీ భావికి సరి పౌరులూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు 

ఇంటికి బంగరు కొండలూ 

తలిదండ్రుల మెత్తని గుండెలూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు  

పిల్లలు పిల్లలు పిల్లలు 

వసివాడని తెల్లని మల్లెలు           

8, మార్చి 2025, శనివారం

మహిలోనా దేవతరా మహిళా

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు.

ఆ సందర్భంగా నేను వ్రాసిన పాట.

మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

లోకమ్మున కల్పతరువు మహిళా
ఇంతి రూపమ్మున ఇంటి పరువు మహిళా
బ్రహ్మయ్యకు మారురూపు మహిళా
వాని కన్నయ్యకు దార రూపు మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

పసివారికి పాలబువ్వ మహిళా
సరి మగనికి ఎద గూటిగువ్వ మహిళా
తనవారికి నెనరు మువ్వ మహిళా
మరి పగవారికి నిప్పురవ్వ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

లాలిస్తే పూలతీగ మహిళా
తాను కోపిస్తే కందిరీగ మహిళా
ద్వేషిస్తే గ్రద్ద డేగ మహిళా
మెచ్చి ప్రేమిస్తే ముద్దు లేగ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

పురుషునికందిన యోగం మహిళా
తల్లి అగుటకూ ఘనత్యాగం మహిళా
కాదనుకో ఇల భోగం మహిళా
ఆగం కాకూడని ఒక యాగం మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా