1, మార్చి 2020, ఆదివారం

'రేప్ పల్లె'

నాడు వ్రేపల్లెలో కృష్ణుని చేత చచ్చి
నేడు మళ్ళీపుట్టారు అసురులు రూటు మార్చి 
నేడు ప్రతి ఊరూ  'రేప్ పల్లె' చూడమ్మా 
పుట్టిన ప్రతి ఆడపిల్ల వారికి  ఓ కృష్ణమ్మ
ఓయమ్మా! వారిని జాగ్రత్తగా కనిపెట్టుకోమ్మా! 
పాలుత్రాగే వయసులో పట్టుకుపోయే 
మగ పూతనలు వస్తారు   
పారాడే వయసులో ఎత్తుకు త్రిప్పుతాననే
శకటాసురులు వస్తారు
నడిచే వయసులో గడ్డి తినే బుద్దిగల 
తృణావర్తులు ఎదురౌతారు
చదువుకునే వయసులో ఎద్దులాపడాలని
వత్సాసురులు చూస్తారు
యవ్వనం లోకి రాగానే
కొంగజప బకాసురులు నోరుతెరుస్తారు
ఆదమరిస్తే నడివయసైనా
కొండచిలువలా చుట్టెయ్యాలని అజగాసురులు తయ్యారు
పెద్దవయసైనా గాడిదబుద్ధితో
గాడితప్పే ధేనుకాసురులు హాజరు 
ఎప్పుడూ ప్రక్కనే ఉంటూ  పక్కజేరాలని 
ప్రలంబాసురులు ప్రాకులాడుతుంటారు
ఒక్కటే అందరి ధ్యేయం
ఆదమరిస్తే హత్యాచారం   
మానమంటే తెలియని మానహీనులు
మానమంటే ఆపని  మాననివారు
మానని గాయంచేసే మానవమృగాలు
ఓ అమ్మా కృష్ణమ్మను
జాగ్రత్తగా కాపాడుకోమ్మా! 

1 కామెంట్‌:

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

గోబి హనుమచ్ఛాస్త్రి వారి రేప్పల్లె కవిత..కృష్టార్పణమై
అబలారక్షణ లక్ష్యంగా వెలుగులు విరజిమ్మింది.
అపూర్వకవితాసృష్టి
అమృతాత్మక కరుణామయదృష్టి
మానవతావిలువలపయోవృష్టి