రవళి మాసపత్రిక ఫిబ్రవరి 2025 సంచికలో ప్రచురితమయిన నేను వ్రాసిన పాట.
తెలుగు "వాడి" పద్యం - పాట _________________________ ఉత్పలమాల:
వీడక తెల్గునెప్పుడును వీడుల వాడల ప్రీతి బల్కుమా!
వాడకనున్నవేళ నది వాడునుగా, మన భాష వాడుమా!
వాడుచు నందులోనగల వాడి గ్రహించుచు, తెల్గువాడివై
వాడును వీడు మెచ్చగను, వాడెద నేనని బాస జేయుమా! ========================================పల్లవి:
తెలుగువాడినని చెప్పూ తెలుగు వాడీ
తెలుపుమా నలుగురికీ తెలుగు వాడీ
వాడి తెలుపుమా నలుగురికీ తెలుగు వాడీ.
చరణం:
వాడవాడలా వదలక వాడాలని చెప్పు
వాడకుంటె వెర్రివాడ వాడుతుందని చెప్పు
వాడవాడలా వదలక వాడాలని చెప్పు
వాడకుంటె వెర్రివాడ వాడుతుందని చెప్పు
వాడువీడు రావాలీ పుట్టివేడీ
వీడు వాడినాపొద్దూ వేడివేడీ
నిన్ను వీడు వాడినాపొద్దూ వేడివేడీ
వాడు తెలుగువాడు కాడురా తెగులు రౌడీ //తెలుగువాడి//
చరణం:
మమ్మి డాడి అంకులాంటి మనవిగావని చెప్పు
అమ్మ నాన్న యనరా నా మనవిరా యని చెప్పు
మమ్మి డాడి అంకులాంటి మనవిగావని చెప్పు
అమ్మ నాన్న యనరా నా మనవిరా యని చెప్పు
అన్న అక్క చెల్లెలనీ అన్నవాడే
మామ అత్త అంటే సుమా మనోడే
అహ మామ అత్త అంటే సుమా మనోడే
తెలుగు వాడువాడు వాడేలే తెలుగు వాడే //తెలుగువాడి//
చరణం:
అక్షరాలు ఏబదారు వదలరాదని చెప్పు
బరువననుచు వదలగా పరువుగాదని చెప్పు
అక్షరాలు ఏబదారు వదలరాదని చెప్పు
బరువననుచు వదలగా పరువుగాదని చెప్పు
అౘ్చులన్ని నేర్వాలీ అౘ్చగానే
హల్లులన్ని పలకాలి హాయిగానే
అహ హల్లులన్ని పలకాలి హాయిగానే
శా,షా ,సా,ళా,లా అని చక్కగానే //తెలుగువాడి//
చరణం:
చాఛాలు జాఝాలు చాలవులే అనిచెప్పు
మధ్యలోన ౘా ౙాలు ఉన్నవిలే అని చెప్పు
చాఛాలు జాఝాలు చాలవులే అనిచెప్పు
మధ్యలోన ౘా ౙాలు ఉన్నవిలే అని చెప్పు
చాప, చూపు, జున్ను, జొన్న లనతప్పురా
ౘాప, ౘూపు, ౙున్ను, ౙొన్న లననొప్పురా
ఒహొ ౘాప, ౘూపు, ౙున్ను, ౙొన్న లననొప్పురా
అనలేకుంటే ౘౘ్చుగుౙ్జు పుచ్చె నీదిరా //తెలుగువాడి//
చరణం:
సుమతి శతక పద్యాలను చూచి నేర్వమని చెప్పు
వేమనకవి ఆటవెలదు లన్ని చదవమని చెప్పు
సుమతి శతక పద్యాలను చూచి నేర్వమని చెప్పు
వేమనకవి ఆటవెలదు లన్ని చదవమని చెప్పు
లోకరీతి తెలుపుతాయి అన్ని చేరి
బ్రతుకునందు చూపుతాయి మంచి దారి
మనకు బ్రతుకునందు చూపుతాయి మంచి దారి
అరె చిన్ననాట నేర్చిందే నిలుచునోరి //తెలుగువాడి//