9, జనవరి 2025, గురువారం

మనసు చిత్రం (గేయం)


అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం గేయ రచనల పోటీ - 3 కొరకు వ్రాసిన గేయం

అంశం: మనసు

 మనసు చిత్రం (గేయం)  


వినరారా మనస్సు చరితం 

కనరారా పరమ విచిత్రం  


పతి మనిషికి ఉండును మనసు  

కనిపించదు కంటికి నలుసు  //వినరారా//  


వదిలేస్తే వానరమేరా

అదుపుంటే అది వరమేరా   //వినరారా//


మానదురా తగిలితె గాయం

పగిలితె ఇక అతకదు ఖాయం  //వినరారా//

 

భాషేమో దానిది మౌనం

నసతో తీస్తుందిర ప్రాణం    //వినరారా//


పగలంతా పరుగులు కనుమా

రాతిరి కల రంగుల సినిమా   //వినరారా// 


చాటుగ నడిపించే దైవం

మాటున దడిపించే దయ్యం  //వినరారా//


ప్రేమిస్తే దింపును స్వర్గం

ద్వేషిస్తే నింపును నరకం  //వినరారా//


బ్రతికున నీ ఆయువు పట్టు  

పోతే మరి తెలియదు గుట్టు  //వినరారా//


 

 

కామెంట్‌లు లేవు: