26, ఆగస్టు 2025, మంగళవారం

వాన బిడ్డ

 అమరావతి సాహితీ మిత్రులు "వారం వారం వచన కవితల పోటీలు" కు గతంలో వ్రాసినది. 

అంశం: వాన  

శీర్షిక: వ(హ)ర్షానుభూతి    


వాన బిడ్డకు ఎన్నిపేర్లో....  

 

పుట్టినప్పుడు ముద్దుగా "చినుకు"   

దోగాడుతూ ఉంటే  "చిరుజల్లు"

తడబడు నడకలైతే  "తుప్పర" 

వడివడిగ నడుస్తూ ఉంటే  "వర్షం"     

గంతులేస్తూ పరుగులెత్తితే "కుంభవృష్టి" 


వాన కురిస్తే ఎన్ని అనుభూతులో...   


చినుకులు మొదలౌతూ ఉంటే   

ఆకాశం అక్షతలను 

తలపై చల్లుతున్నట్లు అనిపిస్తుంది  


చిరుజల్లు చిలకరిస్తూ ఉంటే  

వచ్చే మట్టి వాసన

భూమితల్లి పిలిచినట్లు అనిపిస్తుంది


తుప్పర వస్తూ ఉంటే  

కొంచెమైనా ఒళ్ళూ గొంతూ 

తడుపుకోమని చెప్పినట్లు అనిపిస్తుంది


వర్షం పడుతూ ఉంటే  

పారుతూ ఉండే నీరు 

నేలను కడుగుతున్నట్లు అనిపిస్తుంది 


కుంభవృష్టి కురుస్తూ ఉంటే   

ఇంకచాలు బాబూ వెళ్ళు 

అంటూ పెట్టాలి చీవాట్లు అనిపిస్తుంది.  



25, ఆగస్టు 2025, సోమవారం

"చెప్పు"తా వినండి

 గతంలో అమరావతి సాహితీ మిత్రులు "వారం వారం వచన కవితల పోటీలు" కు వ్రాసిన కవిత

అంశం : చెప్పులు
శీర్షిక: "చెప్పుతా" వినండి


చెప్పులే కదా అని చులకనగా చూడకండి
"చెప్పు" గొప్పతనం "చెప్పుతా" వినండి

కీస్ కీస్ మంటూ నడక నేర్పుతాయి
కిర్రుకిర్రు మంటూ గొప్పను చూపుతాయి

ఇవి లేనిదే ఎవరూ కాలు బైట పెట్టరు
ఇంటిలో కూడా కొందరు వదిలి పెట్టరు

ఎన్నో జతలు ఉంటే పెద్ద "వాడు" వాడు
అసలే లేకుంటే కటిక పేదవాడు చూడు

కాలకుండా పాదాలకు వాడుకుంటారు
బాగా"కాలితే" బూతుపదాలలో "వాడు"తారు

నిరసన తెలపాలంటే వీటినే విసిరేస్తారు
దుష్టులకు వీటితోనే "బుద్ధి" చెప్పేస్తారు

ఏ కాలి చెప్పు తీసినా పోకిరీ పరారు
ఎడమకాలి చెప్పుతో దయ్యం బేజారు

ఈ చెప్పులు చనిపోయిన జంతువుల చర్మం
చనిపోయిన వారిపేర దానం ఒక మర్మం

ఉండకపోవచ్చు ప్రతి ఇంటిముందు తులసి కోట
కాని తప్పక ఉంటుంది ఒక చెప్పుల మేట

మోటుగా వ్యవహరిస్తే కాళ్ళను కరుస్తాయ్
ముద్దుగా చూసుకుంటే మెత్తగా మెరుస్తాయ్

పీఠాధిపతుల కాళ్ళకు ఇవే పావుకోళ్ళు
వివాహాది క్రతువుల్లో చేస్తాయి సందళ్ళు

రామ పాదుకలై రాజ్యాన్ని ఏలినయ్
గొప్పవారి పాద రక్షలై "గుర్తుగా" ఉంటున్నయ్

చెప్పులకైనా ఉంది చెప్పలేనంత చరిత
చెప్పుకుంటూ పోతే ఎంతో వాటి ఘనత.