17, జనవరి 2025, శుక్రవారం

తెలుగుపల్లె లేచింది (గేయం)

 

అమరావతి సాహితీ మిత్రులు గ్రూప్ లో ఇచ్చిన (తేది:5-01-2025) కవిత అంశానికి నేను వ్రాసిన గేయం.

అంశం :సంక్రాంతి
తెలుగుపల్లె లేచింది (గేయం)

తెల్లావారకముందే తెలుగుపల్లె లేచిందీ

సంకురాత్రి నేడంటూ సంబురాలు చేసిందీ
ఊరంతా ఊరేగుతు ఊసులెన్నొ చెప్పిందీ
ఊరంతా ఊరేగుతు ఊసులెన్నొ చెప్పిందీ
తెల్లావారకముందే తెలుగుపల్లె లేచిందీ //తెల్లావారక//

ముంగిట కళ్ళాపిజల్లి రంగవల్లి తీర్చిందీ
చిత్రమైన చిత్రాలను చిత్రంగా వేసిందీ
ముంగిట కళ్ళాపిజల్లి రంగవల్లి తీర్చిందీ
చిత్రమైన చిత్రాలను చిత్రంగా వేసిందీ
ముగ్గులేని ఇంట సిరులు ముసరవులే పొమ్మందీ
ముగ్గులేని ఇంట సిరులు ముసరవులే పొమ్మందీ //తెల్లావారక//

ముగ్గులోన గొబ్బెమ్మలు ముచ్చటగా నిలిపిందీ
పసుపూ కుంకుమ జల్లీ బంతిపూలు పెట్టిందీ
ముగ్గులోన గొబ్బెమ్మలు ముచ్చటగా నిలిపిందీ
పసుపూ కుంకుమ జల్లీ బంతిపూలు పెట్టిందీ
హద్దు దాటితే పేడ ముద్దలే మీరందీ
హద్దు దాటితే పేడ ముద్దలే మీరందీ //తెల్లావారక//

వాకిట్లో హరిదాసును పాటవింటు పిలిచిందీ
అక్షయపాత్రలొ బియ్యం అణకువగా పోసిందీ
వాకిట్లో హరిదాసును పాటవింటు పిలిచిందీ
అక్షయపాత్రలొ బియ్యం అణకువగా పోసిందీ
పరులకింత పెట్టడమే పరమార్థం లెమ్మందీ
పరులకింత పెట్టడమే పరమార్థం లెమ్మందీ //తెల్లావారక//

వీధిలోన గంగిరెద్దు విన్యాసం చూసిందీ
దండం పెట్టినదానిని తట్టి చీరలిచ్చిందీ
వీధిలోన గంగిరెద్దు విన్యాసం చూసిందీ
దండం పెట్టినదానిని తట్టి చీరలిచ్చిందీ
మొద్దులాగ తిని తిరిగితె ఎద్దువే నీవందీ
మొద్దులాగ తిని తిరిగితె ఎద్దువే నీవందీ //తెల్లావారక//

గాలిపటము నెగరేస్తూ గట్టుమీద నిలిచిందీ
పొగరు తోక జాడించే పోజులన్ని చూసిందీ
గాలిపటము నెగరేస్తూ గట్టుమీద నిలిచిందీ
పొగరు తోక జాడించే పోజులన్ని చూసిందీ
అదృష్టపు నూలు తెగితె అధోగతే నీదందీ
అదృష్టపు నూలు తెగితె అధోగతే నీదందీ //తెల్లావారక//

పట్నవాస పిల్లలకూ పల్లెగాలి పంచిందీ
అరిసె గారె పులిహోరల అచ్చ రుచులు చూపిందీ
పట్నవాస పిల్లలకూ పల్లెగాలి పంచిందీ
అరిసె గారె పులిహోరల అచ్చ రుచులు చూపిందీ
బయటి తిండ్లు మానాలని బతిమిలాడి చెప్పిందీ
బయటి తిండ్లు మానాలని బతిమిలాడి చెప్పిందీ //తెల్లావారక//

దూరమున్న తనవారిని ఊరిలోన చూసిందీ
తీపితీపి జ్ఞాపకాలు తీసుకోని పొమ్మందీ
దూరమున్న తనవారిని ఊరిలోన చూసిందీ
తీపితీపి జ్ఞాపకాలు తీసుకోని పొమ్మందీ
కూరిమితో మనమంతా కూడినపుడె పండుగంది
కూరిమితో మనమంతా కూడినపుడె పండుగంది //తెల్లావారక//

కామెంట్‌లు లేవు: