23, జనవరి 2025, గురువారం

స్వతంత్రం అంటే (గేయం)

 అమరావతి సాహితీ మిత్రులు, లో తేది:11-01-2025 ఇచ్చిన అంశము నకు  నేను వ్రాసిన గేయం.

  అంశం:స్వతంత్రం 

 స్వతంత్రం అంటే (గేయం)    


కావాలీ కావాలీ స్వతంత్రం

అందరికీ కావాలీ స్వతంత్రం 

కావాలీ కావాలీ  

అందరికీ కావాలీ

పరిమితిలో ఉండాలీ స్వతంత్రం  

ఎపుడూ హద్దు మీరకుండాలీ స్వతంత్రం  //కావాలీ//      

 

మతం మత్తు కాదురా స్వతంత్రం 

కులం గొడవ కాదురా స్వతంత్రం 

మతం మత్తు కాదురా

కులం గొడవ కాదురా 

హెచ్చు తగ్గు లేనిదే స్వతంత్రం      

అంతా కలసి మెలసి ఉండేదే స్వతంత్రం //కావాలీ// 


దోపిడీలు కాదురా స్వతంత్రం

దుర్మార్గం కాదురా స్వతంత్రం 

దోపిడీలు కాదురా

దుర్మార్గం కాదురా

శాంతితోడ మెలిగేదే స్వతంత్రం 

అంతా హింసలేక ఉండేదే స్వతంత్రం   //కావాలీ// 


బూతు మాట కాదురా స్వతంత్రం 

చెంప వేటు కాదురా స్వతంత్రం 

బూతు మాట కాదురా 

చెంప వేటు కాదురా

సద్విమర్శ చేసేదే స్వతంత్రం  

ఎంతో సహనంతో ఉండేదే స్వతంత్రం   //కావాలీ// 


చెడు తిరుగుడు కాదురా స్వతంత్రం 

అలసత్వం కాదురా స్వతంత్రం 

చెడు తిరుగుడు కాదురా

అలసత్వం కాదురా 

జ్ఞానాన్నీ పొందటమే స్వతంత్రం

విజ్ఞానంతో ఎదగటమే స్వతంత్రం  //కావాలీ//    


విప్పుకొనుట కాదురా స్వతంత్రం  

నిండు ముసుగు కాదురా స్వతంత్రం      

విప్పుకొనుట కాదురా

నిండు ముసుగు కాదురా 

మనిషిగా మసలుకొనుట స్వతంత్రం

మంచీ మర్యాదగ నడచుకొనుట స్వతంత్రం //కావాలీ//  


అవినీతీ కాదురా స్వతంత్రం   

విలాసాలు కాదురా స్వతంత్రం

అవినీతీ కాదురా   

విలాసాలు కాదురా 

తృప్తి తోడ జీవించుట స్వతంత్రం 

మరి నలుగురికీ సాయపడుట స్వతంత్రం  //కావాలీ// 



  

       

17, జనవరి 2025, శుక్రవారం

తెలుగుపల్లె లేచింది (గేయం)

 

అమరావతి సాహితీ మిత్రులు గ్రూప్ లో ఇచ్చిన (తేది:5-01-2025) కవిత అంశానికి నేను వ్రాసిన గేయం.

అంశం :సంక్రాంతి
తెలుగుపల్లె లేచింది (గేయం)

తెల్లావారకముందే తెలుగుపల్లె లేచిందీ

సంకురాత్రి నేడంటూ సంబురాలు చేసిందీ
ఊరంతా ఊరేగుతు ఊసులెన్నొ చెప్పిందీ
ఊరంతా ఊరేగుతు ఊసులెన్నొ చెప్పిందీ
తెల్లావారకముందే తెలుగుపల్లె లేచిందీ //తెల్లావారక//

ముంగిట కళ్ళాపిజల్లి రంగవల్లి తీర్చిందీ
చిత్రమైన చిత్రాలను చిత్రంగా వేసిందీ
ముంగిట కళ్ళాపిజల్లి రంగవల్లి తీర్చిందీ
చిత్రమైన చిత్రాలను చిత్రంగా వేసిందీ
ముగ్గులేని ఇంట సిరులు ముసరవులే పొమ్మందీ
ముగ్గులేని ఇంట సిరులు ముసరవులే పొమ్మందీ //తెల్లావారక//

ముగ్గులోన గొబ్బెమ్మలు ముచ్చటగా నిలిపిందీ
పసుపూ కుంకుమ జల్లీ బంతిపూలు పెట్టిందీ
ముగ్గులోన గొబ్బెమ్మలు ముచ్చటగా నిలిపిందీ
పసుపూ కుంకుమ జల్లీ బంతిపూలు పెట్టిందీ
హద్దు దాటితే పేడ ముద్దలే మీరందీ
హద్దు దాటితే పేడ ముద్దలే మీరందీ //తెల్లావారక//

వాకిట్లో హరిదాసును పాటవింటు పిలిచిందీ
అక్షయపాత్రలొ బియ్యం అణకువగా పోసిందీ
వాకిట్లో హరిదాసును పాటవింటు పిలిచిందీ
అక్షయపాత్రలొ బియ్యం అణకువగా పోసిందీ
పరులకింత పెట్టడమే పరమార్థం లెమ్మందీ
పరులకింత పెట్టడమే పరమార్థం లెమ్మందీ //తెల్లావారక//

వీధిలోన గంగిరెద్దు విన్యాసం చూసిందీ
దండం పెట్టినదానిని తట్టి చీరలిచ్చిందీ
వీధిలోన గంగిరెద్దు విన్యాసం చూసిందీ
దండం పెట్టినదానిని తట్టి చీరలిచ్చిందీ
మొద్దులాగ తిని తిరిగితె ఎద్దువే నీవందీ
మొద్దులాగ తిని తిరిగితె ఎద్దువే నీవందీ //తెల్లావారక//

గాలిపటము నెగరేస్తూ గట్టుమీద నిలిచిందీ
పొగరు తోక జాడించే పోజులన్ని చూసిందీ
గాలిపటము నెగరేస్తూ గట్టుమీద నిలిచిందీ
పొగరు తోక జాడించే పోజులన్ని చూసిందీ
అదృష్టపు నూలు తెగితె అధోగతే నీదందీ
అదృష్టపు నూలు తెగితె అధోగతే నీదందీ //తెల్లావారక//

పట్నవాస పిల్లలకూ పల్లెగాలి పంచిందీ
అరిసె గారె పులిహోరల అచ్చ రుచులు చూపిందీ
పట్నవాస పిల్లలకూ పల్లెగాలి పంచిందీ
అరిసె గారె పులిహోరల అచ్చ రుచులు చూపిందీ
బయటి తిండ్లు మానాలని బతిమిలాడి చెప్పిందీ
బయటి తిండ్లు మానాలని బతిమిలాడి చెప్పిందీ //తెల్లావారక//

దూరమున్న తనవారిని ఊరిలోన చూసిందీ
తీపితీపి జ్ఞాపకాలు తీసుకోని పొమ్మందీ
దూరమున్న తనవారిని ఊరిలోన చూసిందీ
తీపితీపి జ్ఞాపకాలు తీసుకోని పొమ్మందీ
కూరిమితో మనమంతా కూడినపుడె పండుగంది
కూరిమితో మనమంతా కూడినపుడె పండుగంది //తెల్లావారక//

10, జనవరి 2025, శుక్రవారం

వాడికేముంటుంది

 

 పనిచేయక తిని
తొంగుండే వాడి కేముంటుంది
పై మెట్టును ఎక్కాలనుకునే వాడికే
కఠినమైన పరీక్ష ఉంటుంది

పరీక్ష నెగ్గలేదని
ఉరేసుకునే వాడికేముంటుంది
పట్టు బట్టి పైకి ఎక్కేవాడికే
తగిన ప్రతి ఫలముంటుంది

పైకెక్కాక "ఒళ్ళు విరిచి"
పట్టుదప్పే వాడికేముంటుంది
వినయంతో ఒదిగి నిలబడే వాడికే
జగతిని ఖ్యాతి ఉంటుంది.



9, జనవరి 2025, గురువారం

గొంగళిపురుగు

 

సీతాకోక చిలుకను
చూస్తుంటే
గొంగళిపురుగు
"భూతా"న్ని చూపిస్తావేం?


మనసు చిత్రం (గేయం)


అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం గేయ రచనల పోటీ - 3 కొరకు వ్రాసిన గేయం

అంశం: మనసు

 మనసు చిత్రం (గేయం)  


వినరారా మనస్సు చరితం 

కనరారా పరమ విచిత్రం  


పతి మనిషికి ఉండును మనసు  

కనిపించదు కంటికి నలుసు  //వినరారా//  


వదిలేస్తే వానరమేరా

అదుపుంటే అది వరమేరా   //వినరారా//


మానదురా తగిలితె గాయం

పగిలితె ఇక అతకదు ఖాయం  //వినరారా//

 

భాషేమో దానిది మౌనం

నసతో తీస్తుందిర ప్రాణం    //వినరారా//


పగలంతా పరుగులు కనుమా

రాతిరి కల రంగుల సినిమా   //వినరారా// 


చాటుగ నడిపించే దైవం

మాటున దడిపించే దయ్యం  //వినరారా//


ప్రేమిస్తే దింపును స్వర్గం

ద్వేషిస్తే నింపును నరకం  //వినరారా//


బ్రతికున నీ ఆయువు పట్టు  

పోతే మరి తెలియదు గుట్టు  //వినరారా//


 

 

8, జనవరి 2025, బుధవారం

ఆ లోచన

 

తలపుల
తలుపులు
తెరిచి చూస్తే చాలు
ఆ లోచనాలకు
ఆలోచనలే.


తెలుసుకోరా (గేయం)

 


అమరావతి సాహితీ మిత్రులు వారం వారం గేయ రచనల పోటీ - 2 కొరకు వ్రాసిన గేయం.
అంశం: తెలివి పెంచుకోరా! వెలుగు నింపుకోరా!

తెలుసుకోరా (గేయం)


తెలివి పెంచుకోరా!
నీ బ్రతుకున వెలుగు నింపుకోరా!

బ్రతుకు నావకూ చదువొక తెడ్డని
సంస్కారం మరి చుక్కానీ యనీ
తెలిసి నడుచుకోరా! //తెలివి//

నీమాటే నీ మనసుకు అద్దమనీ
పొరబాటు పలుకు నగుబాటౌతుందనీ
తెలిసి పలుకవేరా! //తెలివి//

మర్యాదతో పరులను గౌరవించాలనీ
నీవిచ్చినదే నీకు తిరిగి వస్తుందనీ
తెలిసి ఉండవేరా! //తెలివి//

చెప్పారుకదా ఋషులు ఆ నలుగురినీ
దేవతలుగా ప్రతి మనిషి భావించాలనీ
తెలిసి ఆదరించవేరా! //తెలివి//

సేద్యముగా బ్రతుకును తలవాలనీ
మంచి పంటగా సంతును అందించాలనీ
తెలిసి సాగు చేయవేరా! //తెలివి//

జూదములన్నీ పలు ఖేదములేననీ
బానిసవైతే మత్తుకు నీ భావి చిత్తనీ
తెలిసి వదులుకోరా! //తెలివి//

పారిపోతే పిరికిగా తాడే పామౌతుందనీ
దైర్యం ఉంటే పామైనా తాడు సమానమనీ
తెలిసి పోరవేరా! //తెలివి//

పాపపు సంపాదనతో తింటే అరగదనీ
ఉన్నది కొంచెం పంచుతుంటే పుణ్యమనీ
తెలిసి నిలువవేరా! //తెలివి//

నీవు మనిషిగా పుట్టినదెందుకోననీ
గిట్టేలోగా నలుగురికీ మంచి చేయాలనీ
తెలిసి మసలుకోరా! //తెలివి//


7, జనవరి 2025, మంగళవారం

ఇంతేరా జీవితం (గేయం)

 అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం గేయ రచనల పోటీ - 4 కొరకు వ్రాసిన గేయం.

అంశం: జీవితం

ఇంతేరా జీవితం (గేయం)


ఇంతేరా ఇంతేరా జీవితం
తెలిసిమసలు కోవటమే ఉత్తమం //ఇంతేరా//

జీవితమే ఒక గాలిపటం
జీవితమే ఒక గాలిపటం

పడటం లేవటం
గిరికీలు కొట్టటం
ఎటువైపొ చెప్పలేము దాని వాటం //ఇంతేరా//

జీవితమే ఒక పెను కడలీ
జీవితమే ఒక పెను కడలీ

ఆటులూ పోటులూ
సుడులూ తుఫానులూ
ఎప్పటికీ తెలియలేము దాని వాలూ //ఇంతేరా//

జీవితమే ఒక చదరంగం
జీవితమే ఒక చదరంగం

ఇటువస్తే ఒక బలగం
అటు చూస్తే ఒక బలగం
ఎత్తులతో చిత్తులతో వీరంగం //ఇంతేరా//

జీవితమే ఒక నాటకం
జీవితమే ఒక నాటకం

పలు పాత్రల వాలకం
నటనలతో పూనకం
ఎవరికీ తట్టదు ముగింపు కీలకం //ఇంతేరా//


6, జనవరి 2025, సోమవారం

హ్యాపీ న్యూ ఇయర్ (గేయం)

 అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం కవితల పోటీ - 1 కొరకు వ్రాసిన గేయం

అంశం: "కొత్త సంవత్సరం "

హ్యాపీ న్యూ ఇయర్ (గేయం)

హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ న్యూ ఇయర్
విష్యూ హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ న్యూ ఇయర్ //హ్యాపీ//

టాటా చెబుదాం పోయేకాలం
పోనీ మై డియర్
పాజిటివ్ గా చూశావంటే
అంతా లైన్ క్లియర్ (2)

వచ్చేదంతా మంచికాలమే
వదిలెయ్ నువ్ ఫియర్ //హ్యాపీ//


గుడ్ బై చెప్పే
ఓల్డ్ ఇయరంతా 'డర్టీ' కాదురా
వెల్కం న్యూ ఇయరంటే
మిడ్ నైట్ పార్టీ కాదురా (2)

గుడ్ మార్నింగ్ గుడ్ నైట్
రోజూ కలిగే 'వే' లో సాగరా //హ్యాపీ//

ఒక్కరోజునా 'విష్షెస్' చెప్పీ
చేస్తే చాల షికారూ?
గోడక్కొట్టిన క్యాలెండరు
మార్చేస్తే చాలదు సారూ! (2)

న్యూ లుక్కుగా టైం టేబుల్ తో
రీచవ్వర నీ గోలూ //హ్యాపీ//

పాస్ట్ ఈజ్ పాస్ట్, బ్యాడ్ మెమొరీస్
ధ్వంసం చేసేసెయ్
ఫాస్ట్ ఫాస్ట్ గా బెస్ట్ ఫ్యూచరూ
'యావ్ సం' చేసేసెయ్ (2)

రెస్టు వరెస్టని రేసులలో
ఎవరెస్టును తాకేసెయ్ //హ్యాపీ//


2, జనవరి 2025, గురువారం

యవ్వనం (గేయం)

 అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం గేయ రచనల పోటీ -5 కొరకు వ్రాసిన గేయం 

అంశం: యవ్వనం 


 వ్వనం యవ్వనం 

మురిపించే మధువనం

ఆమని వీడక నిలచే 

సొగసుల బృందావనం  //యవ్వనం// 


పరుగెత్తే హిమనదం 

వడిసాగే ఘన జలదం (2)

ఆశువుగా అలరించే 

రసరమ్యపు కవి పదం  //యవ్వనం//


మది పుట్టదు గద భయం

తన లక్ష్యము మరి జయం (2)

జవసత్వమ్ముల సాగుచు

కదములు త్రొక్కెడి హయం  //యవ్వనం//


పట్టును అభిమత ధ్వజం 

వదలదులే ఇది నిజం (2)

పట్టగ సంకెళ్ళులేక

వని తిరిగే మదగజం   //యవ్వనం//


నవ సుమముల పరిమళం

నవరసముల రుచి ఫలం (2)

దశదిశలను నినదించే

శంఖారవముల గళం  //యవ్వనం//  

 

చిత్రించని ఒక పటం

పడిలేచే పెను కెరటం (2)

పలు ఆశల ఊడలతో

చిగురులు వేసెడు వటం  //యవ్వనం// 


వదిలేస్తే కలకలం 

బంధిస్తే వ్యాకులం (2)

పగ్గాలను చేతబట్టి

పయనిస్తే గోకులం   //యవ్వనం//  


సరి బాటను సాగితే

చెడు చేతలు వీడితే (2)

సుందర భావిని కోరుచు 

నడివయసును నడిపితే   //యవ్వనం// 



1, జనవరి 2025, బుధవారం

వంగడం


 మొలకెత్తింది
"క్రొత్త 2025" వంగడం
"వెలుగు" వృక్షమై నిలచి
"మాను"కోవాలి చీకటికి "వంగడం"