22, ఏప్రిల్ 2024, సోమవారం

శాంతి వనం

 21-04-2024 న అమరావతి సాహితీ మిత్రులు సభలో 

"ప్రపంచ శాంతి" అనే అంశం పై  చదివి ప్రశంస మరియు సత్కారం పొందిన కవిత. 


శీర్షిక: శాంతి వనం. 


పరచుకొని ఉంటే ప్రపంచ శాంతి   

కొన్నిదేశాలకు ఉండదు మనశ్శాంతి    

  

ఐదు వేళ్ళూ నోట్లోకి పోని దేశమైనా 

ఆయుధాలు మాత్రం పోగేసుకుంటుంది  


ప్రక్క దేశంపై పెంచుకుంటుంది పగలు  

నిద్ర లేకుండా చేస్తుంది రాత్రీ పగలు  


అందుకే పెద్దరాజులు  మంటలు రాజేస్తూ ఉంటారు 

ఒకడికి వెన్నంటి మెత్తగా వెన్నంటి మాటలు చెప్తారు 


సాయం చేస్తూ  మిత్రుడిలా అంట కాగుతారు 

తమ దగ్గరి ఆయుధాలను అంటగడతారు    

 

ఇరు దేశాల మధ్య వచ్చే "ఢీ" పావళి 

ఆయుధ టపాసుల వ్యాపారులకి "దీపావళి"    


యుద్ధమంటే అది భూమికి కడుపు మంటే

జరిగే మారణ హోమం భావితరాలకు విష ధూమం  


అణుబాంబులను పండించి గాదెలలో నింపటమంటే 

అగ్ని పర్వతంపై మానవజాతిని నిలబెట్టడమే  

 

పంచభూతాలతో చెలగాటమాడటమంటే    

ప్రపంచ భూతాలుగా మారి  వినాశం తెచ్చుకోవడమే   

  

ఇప్పటికైనా మూర్ఖపు  ఉగ్రవాదాన్ని వీడాలి

ముప్పుతెలిసి యుద్ధోన్మాదాన్ని వదలాలి 


కలసి మెలసి ఉంటుంటే కంచెలతో పని ఉందా   

భాయి భాయి అనుకుంటే ఆయుధాలు అవసరమా    


గత చరిత్రలో తగిలిన గాయాలను తలచుకోవాలి 

మన ధరిత్రిని శాంతి వనంగా మలచుకోవాలి  


ఇది తెలుసుకొని మానవ లోకం మెలగాలి

నవ శకంతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి.       

 




3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బావుంది

అజ్ఞాత చెప్పారు...

బావుంది

అజ్ఞాత చెప్పారు...

ఇది కవిత్వం కాదు. కొన్ని వాక్యాలను పంక్తులుగా విడగొడితే కవిత్వం అవదు.